Wednesday, December 27, 2017

14 వ రోజు - వేదమే ప్రమాణం

ఆండాళ్  తిరువడిగలే శరణం

పాశురము

ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్




మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది.  ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది. 


"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్"
 ఎర్ర కలవలు వికసిస్తున్నాయి"ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు.  లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావల్సిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు.  
పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక

"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్"తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ "ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్"తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు.  తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది. 

అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ  "ఎంగళై"మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్"  ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే!  "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.
జ్ఞానులు తమ హృదయంలో  భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో.  లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో " శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

13 వ రోజు - తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు

ఆండాళ్ తిరువడిగలే శరణం    

పాశురము

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్


ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన  జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో  ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అనిరెండు జట్టులుగా విడిపోయారు.
వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మద్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె  శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత  వాల్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి " సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.


కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై"  ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారుఅంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై"  రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు.   "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.

"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ  "పావైక్కళం పుక్కార్"వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే  గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది,  "వియారమ్" బృహస్పతి"ఉఱంగిత్తు"  అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోదంగా ఉన్నాయి,  ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి  చేరటానికి ఇది సరియైన సమయం.

"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా.  తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టిచ్చుకోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో  "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా   "పావాయ్!" ముగ్దత కల్గిన దానా,  " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం 

12 వ రోజు - లక్ష్మణుడి కర్మ విదానం

ఆండాళ్ తిరువడిగలేశరణం      

పాశురము

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితి కి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు  అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశ ను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్శణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.
"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే  |
  ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్  || "


వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు.  మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.
"దుఖెఃషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే  " 


ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు.  ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్. 


"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది, ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమజ్ఞమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి ,  "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.

ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి  కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం  చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే.  నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.

"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం  కూడా భగవంతుణ్ణిఅనుభవించేట్టు చేస్తుంది.  "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం,  ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం క్కొట్టుకు పోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పై కప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .

అయితే లోపలున్న గోప బాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో  "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా  "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా!  "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇక నైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం  

11 వ రోజు - భగవంతుడు వశమైయ్యేది భక్తి సౌందర్యం తోనే

ఆండాళ్ తిరువడిగళే శరణం      


పాశురము

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ   చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం  పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు  నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్


గోపికలు "యుగాయితం నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే" అని భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడు తమనొక నాయికగా భగవంతున్ని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానం వారి సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి వెనకాతల కారణభూతుడైన  భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తారు . ఇలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు. 

ఇవాలటి గోపబాలికది దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్శించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆక
ర్శించేది భక్తి సౌందర్యం. ఈవాలటి గోప బాలికకు అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోప బాలిక.  భగవత్ సేవా సంపద గొప్పగా కల్గినది కాబట్టి,  ఈవిడని తీసుకొని వెళ్తే  శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఈవాలటి గోప బాలికను లేపుతుంది.  


"కత్తుకఱవై"
 దూడలకు పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే   "క్కణఙ్గళ్" గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల  "పలకఱందు" పాలు పితకటంలో నేర్పరులు.  "శెత్తార్ తిఱల్ అరియ"  శత్రువుల బలం నశించేట్టుగా "చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం"  వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, "కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం" ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది.  శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన  "పొఱ్కొడియే"  బంగారు తీగ, తీగ ఎదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు తీగ.  



శరీరంలో ఏదో ఒక అవయవం అందంగా ఉంటె అది సౌందర్యం అంటారు, అదే సామూహికంగా పాదాది కేశాన్తంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు.మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి ఇలా వర్ణిస్తోంది. "పుత్తరవల్ గుల్ " తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా  చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక పాములాంటి అందం కల్గి ఉండి, "పునమయిలే" ఏభయంలేని తన వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా. "పోదరాయ్"రావమ్మా!! నీవెంట మేము నడుస్తాం.
"శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు" ఈ చుట్టూ ఉండే  చెలికత్తెలు అందరూ వచ్చి, "నిన్-ముత్తం పుగుందు" నీ ముంగిట ప్రవేశించి,  "ముగిల్ వణ్ణన్ పేర్-పాడ"  నీలమేఘశ్యాముని పేరు పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని చూసి ఎలా పరుగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యామున్ని మెం కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, "శిత్తాదే" ఉలుకు లేదు  "పేశాదే" పలుకు లేదు  "శెల్వప్పెణ్డాట్టి" ఓ సంపన్నురాలా! ఎమమ్మా ఐశ్వర్య మదమా  "నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్" లేకుంటె ఎందుకు పడుకున్నావు  అంటూ లోపలి గోపబాలిక వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం   

10 వ రోజు - ముని యొక్క దశ

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము

  నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
 
ఆండాళ్ తల్లియొక్క సంకల్పం అందరూ కలవాలి,వైయత్తు వళ్ వీర్గాళ్ ఈ భూమిమీద ఉన్నవాళ్ళంతా ఒకటి, ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం.  ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దూ అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికికరాలకోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తుంది.  పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెపుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం.  

మానవ జీవితం అనగా సుఖ దుఖాఃలు నదీ తరంగాలుగా ఒక దానివెంట ఒకటి వస్తూనేవుంటాయి. సుఖమైనా దుఖఃమైనా  ఎప్పటికి నిలిచి ఉండవు.  అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి. సుఖ దుఖాఃలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది, అయితే దుఖం వల్లనన్నా లేక సుఖం వల్ల నన్నా చెడుతుంది. సుఖం వచ్చినప్పుడు మిడిసి పడ కూడదు. సుఖః దుఖాఃలు ప్రమాదకరం కాదు, వాటియందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏంచెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. 


దుఖేఃషు అణుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్పృహః |
వీత రాగ భయ క్రోదః స్తితదీః మునిరుచ్యతే ||




మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం  చేసుకుంటూ ఉండాలి- వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై సృహ ఉండకుండా చేసుకోకు, దుఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విజ్ఞం చెందకుండా ఉండాలి. మనకు వీటియందు పట్టు ఉండకుండాచూసుకోవాలి. మనలోని రాగం భయం గామారి క్రోదంగా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కల్గి ఉన్నది.

"నోత్తు" మాకు  నోము ఇంకా ప్రారంభం కాలేదు, కానీ నీనోము అయిపోయింది. ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది."చ్చువర్ క్కం పుగుగిన్ఱ" నిద్రలో హాయిగా  స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు, అంటే కృష్ణుడు నీవద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సకలలోకాలనన్నినింటిని తనలోచూపించాడుకదా, ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం. ఆయనలో సకలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. "తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః " ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు.  "అమ్మనాయ్" ఓ యజమానురాలా! యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. "మాత్తముం తారారో" ఒక మాట మాతో మాట్లాడరాదా  "వాశల్ తిఱవాదార్" తలుపులు తర్వాత తీద్దువుగాని,  లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నీన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష.
వీళ్ళు కృష్ణుడులోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తున్నారు, ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోప బాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు. "నాత్తత్తుళాయ్ ముడి" లోపలుండే వాడు మన స్వామియే, ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం. 


లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడెక్కడినుండి వస్తాడు అని అంది."నారాయణన్" అంతటా వ్యాపించినవాడేకదా ఆయన, సకల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా!  "నమ్మాల్ పోత్త ప్పఱై తరుం"దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులరందరికి అందేవాడు ఆయన. "పుణ్ణియనాల్" పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు.  ఆయన అందరికి అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా!

"పండొరునాళ్" ఇదివరకు ఒకనాడు "కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం" మృత్యువు నోట్లో దూరాడు కుంభకరణుడు. రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకరణుడిని చంపలా, కుంభకరణుడే మృత్యువులో నోట్లో దూరాడు. దీప కాంతికోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా! బుద్దిమంతుడూ ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు, బుద్ది హీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. "తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో" ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా. పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాళ్ తల్లి.
ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే, కుభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటుంది. అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టిన వాడు. శివుని వివాహానికి హిమాలయాపర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలుపర్వతానికి పోటితో పెరుగుతుంటే దేవతలంతా గాబరా పడి ఈయనని అడిగితే, వింధ్య పర్వతం ఈయన శిష్యుడు. ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు  అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్ప తనం. మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అదిష్టాన శక్తివిశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం. ఈ భూమినీ మనం అలాగే భావిస్తాం, ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు, అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి ఆంటాం. అగం-ప్రర్వతం స్త- పెరుగుదలని నిలిపిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన. ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది. 

లోపల గోపబాలిక లేచి కృష్ణా అంటూ లేచింది, "ఆత్త అనందల్ ఉడైయాయ్!" పెద్ద బద్దకం కల దానా,  "అరుంగలమే" అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారుకాదు. "తేత్తమాయ్ వందు తిఱవ్" తొందరగా సర్దుకొని రావమ్మా.


 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం   

09 వ రోజు - భగవంతునికి మనకు ఉన్న సంబంధం

ఆండాళ్ తిరువడిగలే శరణం  
  

పాశురము

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్  అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. "తూ"పరిశుద్దమైన  "మణి" మణులతో చేసిన  "మాడత్తు" మేడ, "చ్చుత్తుం విళక్కెరియ" చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి.  ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక, దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణాలు.  అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం.  అందుకే మన  జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అణుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది.  ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని  కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది.  "దూపం కమళ" దూపం పరిమళిస్తుంది. "త్తుయిల్  అణైమేల్ కణ్ వళరుమ్" నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా.  "మామాన్ మగళే!" ఓ మామగారి కూతురా! "మణి క్కదవం తాళ్ తిఱవాయ్" మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. సంస్కృతంలో వివిద అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆధిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.
1. మనందరిని తండ్రి ఆయనే

2. మనందరిని రక్షించేవాడు ఆయనే

3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు

4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు

5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు 

6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే

7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు

8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు

9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే

లోకంలో మనం ఎదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! "పితా రక్షకః శేషిభర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా" అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ దూప పరిమలాల వంటిది.
 
అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య  ఆకృతిని స్మరించుకున్నా వాల్ల స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం.   మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు, దీన్ని పోశించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలేయ్యాలి అని ఇలా దేహ బ్రాంతి పెరిగిపోతుంది, ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్శనమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం.  ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరువాల్సిందే. 
"మామీర్!" ఓమెనత్తా,  "అవళై ఎళుప్పీరో" మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. "ఉన్ మగళ్ తాన్ ఊమైయో" నీపిల్ల ఏమైనా మూగదా  లేక "అన్ఱి చ్చెవిడో" చెవిటిదా  లేక "అనందలో" అలసిపోయిందా  "ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో"  ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడిని నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగివాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.



ఆయితే లోపలగోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది.


"మామాయన్"
 చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్శించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం 
చేత చేసాడు.
ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు  అయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, "మాదవన్" మా-లక్ష్మీదేవి  దవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన "వైకుందన్" వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా "ఎన్ఱెన్ఱు" ఎన్నెన్నో "నామం పలవుం నవిన్ఱ్" నామాలను పలుకుతున్నాం. 

ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం   

Tuesday, December 26, 2017

Sri Vaikuntha Ekadasi

Om Namo Venkatesaya.

Sri Vaikuntha Ekadasi of this year is falling on 29.12.2017. SVTT is performing the Puja celebration of Lord Sri Venkateswara Swamy with Sridevi & Bhudevi in the house of Sri PVB Seetharam, Kanheipur, Jajpur Road on the above mentioned date i.e. 29.12.2017.

All the members and devotees are requested to come and get the blessings of the Lord along with Prasadam.
Programme is as under:

On 29.12.2017 (Morning)

At 5.30 AM Sri Venkateswara Suprabhatam;
at 6.00 AM Purushsookta Vidhana Ashtotthara Satha Namavali sahitha Puja with Abhishekam;

at 6.25 AM Mantrapushpanjali;

at 6.30 AM Chanting of Sri Vishnu Sahasra Namamulu;

at 6.50 AM changing of Govinda Namamulu;

at 7.00 AM Prasada Sevanam.

On 29.12.2017 (Evening)
At 6.30 PM Purushasooktha Vidhana Ashtotthara Sathanamavali Puja;
at 6.55 PM Mantra Pushpanjali;
at 7.00 PM Chanting of Sri Vishnu Sahasra Namamulu;
at 7.20 PM Chanting of Govinda Namamulu;
at 7.30PM Chanting of Sri Tallapaka Annamacharya's Keerthans;
at 8.00 PM Mangala Harathi followed by Prasada Sevanam.

All are requested to come at the venue mentioned above and get the blessings of Lord Sri Venkateswara Swamy Varu along with His Deverulu.

Don't leave the place without Prasada Sevanam on the day.

Om Namo Venkatesaya.
SVTT, JAJPUR ROAD.
Please contact Mr. PVB Seetharam for his detailed address. His mobile number is 09861141453 / 07008827988(Mrs. Seetharam).

Friday, December 22, 2017

08 వ రోజు - నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు

 ఆండాళ్ తిరువడిగలే శరణం     

  

పాశురము


కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్


 

ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెర చాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగం వేగం గా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అదీ కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పోదాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. "అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే" మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని.  మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పోందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు. 

మరి ఎం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది భహుషా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కాదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట భయలుదేరింది.   మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చేయ్యాలో చెప్పు అని అడిగింది. "ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ" అంటూ ఉపదేషం చేసాడు. హే మైత్రేయీ "ఆత్మావారే ద్రష్టవ్యః "లోపల ఉండే ఆత్మా అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది ? ద్రష్టవ్యః -చూడాలి అనుకున్న దాన్ని మొదట "శ్రోతవ్యః"వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి.  మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. అండాళ్ తల్లి చెప్పేది ఎదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత.

మొదట పక్షులు అరిస్తున్నాయి అని చెప్పింది, ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది - ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక, ఆలయ పిలుపు శఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వని ని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే ముణులు స్మరించువాడు అని తెపిపింది, వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా ముణుల వద్ద ఉపదేషం పొంది మనం ఇక మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం "ద్రష్టవ్యః" అప్పుడు స్పష్టంగా చూడగలం. 

"కీళ్" తూర్పు దిక్కున "వానమ్" ఆకాశం  "వెళ్ళెన్ఱ్" తెల్లవారిందని అనుకుని "ఎరు మై"గేదెలన్ని కూడా  "శిఱు వీడు  మెయ్యాన్" చిన్న మేత మేయడానికి "పరందన కాణ్" పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. సాదారణంగా గేదెలను తామసిక గుణం తో పోలుస్తారు, తెలవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం భాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు-"రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే" మనలోపలుండే సర్వ రసుడు, సర్వ గంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు. 

"మిక్కుళ్ళ పిళ్ళైగళుం" మిగతా పిల్లలందరూ "పోవాన్ పోగిన్ఱారై" త్వరత్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే "ప్పోగామల్ కాత్తు" వాళ్ళను ఆపి,"ఉన్నైక్కూవువాన్  వందు నిన్ఱోం" నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే, "కోదుగలం ఉడైయ పాపాయ్!"శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కల్గించే గోపికవి కదా నివ్వు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా "ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియః" జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకూ జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మావెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. "ఎళుందిరాయ్"లేవమ్మా అందరం కలిసి వెళ్దాం. ఇక్కడకు వెళ్ళి "పాడి ప్పఱై కొండు" మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం. 

"మావాయ్ పిళందానై" గుఱ్ఱం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేసాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది. యముడు నచికేతుడికి చెబుతాడు "ఇంద్రియాణి హయానాహుః" శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే ఖల్లెంతో బుద్ది అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేసాడు.


"మల్లరై మాట్టియ" మథురా నగరిలో మల్ల యోదులైన చాణూరుడు ముష్టికుడులను ఖంసుడు శ్రీకృష్ణ బలరాములని సంహరించడానికి ఎర్పాటుచేసాడు. వారు మారక ద్రవ్యం సేవించి ఉన్నారు, కృష్ణ బలరాములు వారి మద్యకి వెళ్ళి, ఇరువురు వారిని వారే సంహరించుకొనేట్లు చేసారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోదాలు ఈ మల్ల యోదులవంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరణైరేవ కన్యతే- దేనితోనైతె నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి. అగ్నికి కావల్సింది ఇందనం, ఇందనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి.  రావణ వద అనంతరం, హే రావణా ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు, నిన్నా వీరు అణిచివేసింది, నీలోని కామ క్రోదాలను పైకి లేపుకున్నావు వాటితోనే నిన్ను నేవే చంపుకున్నావు! అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడివైపు మనం మలిస్తే వాటిని కృష్ణుడే సంహరించివేస్తాడు. 

"దేవాది దేవనై" ఆయన దేవాది దేవుడు,  మనల్ని ఆయన ఎప్పుడు వదలడు. ఇన్నాళ్ళూ మనం నీవాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితో ఒక్క సారి అను. ఏమని "చ్చెన్ఱు నాం శేవిత్తాల్" ఒక్క సారి మనం చేరి తండ్రీ మేము నీవారవని తెలిపితే చాలు.  "ఆవా ఎన్ఱ్ ఆరాయ్ అంద్ అరుళ్" మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణం లోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు, అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొర పెట్టుకున్నారు. రాముడు నేను అయోద్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని, తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గు పడ్డాడు. ఇదీ పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మనకోసం తపిస్తాడు. తిరుమరిసై ఆళ్వార్,ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు, ఆయన కాంచీ పురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయనదేవున్ని పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు అని అన్నాడు, దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారూ  బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడం తో, రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చాడట.  ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. యదోక్తకారి- ఎలా చెపితే అలా వినే పెరుమాళ్ అని అర్థం ఇది కాంచి పురంలో ఒక ఆలయం. 

అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి, భగవంతుని అనుగ్రహం మనపై పడేట్టు చేస్తుంది.

 

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం  

Thursday, December 21, 2017

07 వ రోజు - భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము

ఆండాళ్ తిరువడిగలే శరణం  

పాశురము


కీశు కీశెన్ఱెంగుం  ఆనైచ్చాత్తన్  కలందు 
పేశిన  పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్  మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి 
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్


 


"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి."కలందు పేశిన  పేచ్చరవం కేట్టిలైయో"   పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే  అని బాధతో మట్లాడుతున్నాయి.  నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి,  అంటూ అండాళ్ తల్లి   "ఆనైచ్చాత్తన్"  భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.

ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు.  అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు.  ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది.  అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా  సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిస్సు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు. మాళ్ళీ వేద అద్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయిస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు.కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ.   భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు.  అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు.  ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు  "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా  అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది. 

గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు. 

"కాశుం పిఱప్పుం కలకలప్ప  క్కై పేర్ త్తు"గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి,  "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి.  "మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేడా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు. 

"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు.  ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన  "మూర్తి"మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు. 

కేవలం అందమైనవాడేనా!  కాదూ,  మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు.  కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు. 


అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది.  "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

Wednesday, December 20, 2017

06 వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ

 ఆండాళ్ తిరువడిగలే శరణం    

పాశురము


పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై 
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది.  మనకో సందేహం రావచ్చు.  శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప  వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.           

శ్రీకృష్ణ పరమాత్మ రేండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాల్లు పడుకొని ఉంటారు, అందరు పడుకొనే వద్ద వాల్లు మెలుకువగా ఉంటారు.  సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా  జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని  విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే  గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దషల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.

  
ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు.  అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్ "  పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే  రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే.  అందుకే మనవాల్లు ఒక గుర్తుగా చెప్పారు. 

లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది,  మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! " ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు.  "ఎళుందిరాయ్"- మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్"ముణులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా!  మరి వాల్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది. 

"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు- దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు. 

"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద  పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి. 

"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న  జగత్తుకు బీజమైన స్వామి.  అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను  వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి.  అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.   

 

   

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం  

 

Monday, December 18, 2017

05 వ రోజు - భగవంతుని ఐదో స్థానం - అర్చా స్వరూపం

ఆండాళ్ తిరువడిగలే శరణం 

పాశురము


మాయనై మన్ను వడమదురై మైందనై

తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై

ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై

తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు

వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క

పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం

తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం.  ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు.  కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో.  అంతటావ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఏదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే.  ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు. అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి.  ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విష్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు.  అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు.  ఆధునిక అణువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది- దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రంల ద్వార గుర్తించగల్గుతున్నాం.  అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో.  రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు- "సమ్షయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంషయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది. 

 

ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు.మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోక క్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తె మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది.  ఇకవారంతా శ్రీకృష్ణుడికోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంషయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంషయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది- అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంషయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంషయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ- ఒక తుమ్మెద ఒక పద్మం పై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది ఒక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంషయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది- ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరం పైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లెదో అని సంషయాన్ని తెలియ జేసింది. 

ఇలాంటి సంషయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు.  ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే.  ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు.  భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది.  మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు-ఆగామి-ప్రారబ్దం అని అంటారు.  ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు.  మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది.  భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు.  ఇక ప్రారబ్దం కుడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది  వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది. 

"మాయనై మన్ను వడమదురై మైందనై" - చిత్ర విచిత్ర మైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు.  అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో.  పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. "ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులమ్లో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమి చేతకాని వాడిలా పడి ఉంటాడు- అందుకే ఆయనను దామోదరుడు అంటారు.  దామ- ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.

అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర  ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం.  ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కోలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు "దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది. "నాం తూమలర్ తూవి త్తొళుదు"పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం. "పోయ పిళైయుం " మనం గతంలోచేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం " మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు.  ఈపాటలో ఆండాళ్  మాయానై, మన్నువడ మదురై,  దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది. 

ఆగమములు చెప్పినదేమిటి

పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||

ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది.  పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా  పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మత్రం దానికి సమాధానం ఇస్తుంది. "పూర్ణమిదమ్"- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:"- అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. "పూర్ణాత్ పూర్ణముదచ్యతే"- ఆ పూర్ణమే  ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే. సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది.  అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా. "పూర్ణస్య పూర్ణమాదాయ" ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా?  "పూర్ణమేవా వశిష్యతే"- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి. 

ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు.

 

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం