Thursday, December 21, 2017

07 వ రోజు - భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము

ఆండాళ్ తిరువడిగలే శరణం  

పాశురము


కీశు కీశెన్ఱెంగుం  ఆనైచ్చాత్తన్  కలందు 
పేశిన  పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్  మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి 
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్


 


"కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి."కలందు పేశిన  పేచ్చరవం కేట్టిలైయో"   పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే  అని బాధతో మట్లాడుతున్నాయి.  నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి,  అంటూ అండాళ్ తల్లి   "ఆనైచ్చాత్తన్"  భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.

ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు.  అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు.  ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది.  అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా  సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిస్సు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు. మాళ్ళీ వేద అద్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయిస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు.కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ.   భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు.  అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు.  ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు  "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా  అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది. 

గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు. 

"కాశుం పిఱప్పుం కలకలప్ప  క్కై పేర్ త్తు"గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి,  "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి.  "మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేడా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు. 

"నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు.  ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన  "మూర్తి"మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు. 

కేవలం అందమైనవాడేనా!  కాదూ,  మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు.  కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు. 


అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది.  "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

Wednesday, December 20, 2017

06 వ రోజు - స్థిత ప్రజ్ఞుల దశ

 ఆండాళ్ తిరువడిగలే శరణం    

పాశురము


పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై 
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికలను లేపడం ప్రారంభిస్తుంది.  మనకో సందేహం రావచ్చు.  శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడంలేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్ర పోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందులాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేసాయే తప్ప  వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి.           

శ్రీకృష్ణ పరమాత్మ రేండో అధ్యాయమంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాల్లు పడుకొని ఉంటారు, అందరు పడుకొనే వద్ద వాల్లు మెలుకువగా ఉంటారు.  సామన్యులు శారీరక సుఖాలలో మెలుకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో, వెనకల ఉండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా  జ్ఞానం కల్గి ఉంటారు. మరి జ్ఞాణులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా, భగవంతుని  విషయంలో జాగరూపులై ఉంటారు. ఆలోపల ఉండే  గోపికలూ అట్లాంటివారే. అందుకే మనం వాళ్ళను మన తోడుపెట్టుకొని భగవంతుని దగ్గరకు వెలితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్ఞమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దషల్లోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది.

  
ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్ని పిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకేరకమైన భావం కల్గి ఉంటారు.  అలాంటి ఒక గోపబాలికను లేపుతూ "పుళ్ళుం శిలమ్బిన కాణ్ "  పక్షులు అరుస్తున్నాయ్ లేవవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైన పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే, జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే  రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వములో విహరించే మహానుభావుల పలుకులు, మనల్ని అజ్ఞానములోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే.  అందుకే మనవాల్లు ఒక గుర్తుగా చెప్పారు. 

లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయి అని భావించినట్లుంది,  మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు "పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! " ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి - విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ద్వని కుడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్లా అని అంటుంది. అక్కడి దీప కాంతి శంఖం ఊదే వాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని అండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ - తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు.  "ఎళుందిరాయ్"- మేలుకో. మరి అండాళ్ తల్లి తాను ఎలా మేలుకొందో కొన్ని గుర్తులు చెబుతుంది. "మునివర్గ ళుం యోగిగళుం మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుంద్"ముణులూ,యోగులూ మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి-హరి-హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగావినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం, నీకు వినబడలేడా!  మరి వాల్లు మూడు సార్లు హరినామం ఎందుకు అన్నారో అండాళ్ తల్లి వివరిస్తుంది. 

"పేయ్ములై నంజుండు" పూతన స్తనాలకు అంటి ఉన్న విషాన్ని ఆరగించాడు- దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు - వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే "ఆహం-మన" అనే విషాలను హరించేవాడా - హరి అని జ్ఞానులు తలుస్తున్నారు. 

"కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి" శ్రీ కృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి క్రింద  పడుకోబెట్టింది, ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీ కృష్ణుని సంహరించాటానికి చూసాడు. కపట శకటాసురున్ని కాలుజాచి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది, పుణ్య-పాపాలు దాని చక్రాలవంటివి, మనల్ని నడిపించే పరమాత్మను దానిక్రింద పెట్టి ఆయన పాదాలను- చరణౌ శరణం ప్రపద్యే అంటే చాలు- మనకు అంటి ఉన్న పుణ్య-పాప సంపర్కాన్ని హరించువాడా - హరి. 

"వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు" - ఆదిశేషువుపై సుకుమారంగా పవళించి ఉన్న  జగత్తుకు బీజమైన స్వామి.  అయిదు తలల ఆదిశేషువు - అయిదు రకాల జ్ఞానములను తెలియ జేస్తుంది. నేను  వాడికి చెందిన వాన్ని, వాడు నన్ను తరింపచేయువాడు, వాన్ని చేరే సాధనం వాడి శరణాగతే, వాన్ని చేరితే కలిగే ఫలితం వాని సేవ, వాన్ని చేరకుండా ఉంచే ఆటకం వానియందు రుచిలేకుండుట అనే అయిదు జ్ఞానాలు కల్గి ఉండే వారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసినవాడా- హరి.  అంటూ మూడు సార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ అండాళ్ తల్లి గోప బాలికను లేపింది.   

 

   

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం  

 

Monday, December 18, 2017

05 వ రోజు - భగవంతుని ఐదో స్థానం - అర్చా స్వరూపం

ఆండాళ్ తిరువడిగలే శరణం 

పాశురము


మాయనై మన్ను వడమదురై మైందనై

తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై

ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై

తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు

వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క

పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం

తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం.  ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు.  కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో.  అంతటావ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఏదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే.  ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు. అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి.  ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విష్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు.  అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు.  ఆధునిక అణువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది- దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రంల ద్వార గుర్తించగల్గుతున్నాం.  అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో.  రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు- "సమ్షయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంషయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది. 

 

ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు.మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోక క్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తె మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది.  ఇకవారంతా శ్రీకృష్ణుడికోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంషయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంషయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది- అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంషయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంషయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ- ఒక తుమ్మెద ఒక పద్మం పై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది ఒక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంషయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది- ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరం పైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లెదో అని సంషయాన్ని తెలియ జేసింది. 

ఇలాంటి సంషయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు.  ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే.  ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు.  భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది.  మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు-ఆగామి-ప్రారబ్దం అని అంటారు.  ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు.  మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది.  భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు.  ఇక ప్రారబ్దం కుడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది  వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది. 

"మాయనై మన్ను వడమదురై మైందనై" - చిత్ర విచిత్ర మైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు.  అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో.  పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. "ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులమ్లో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమి చేతకాని వాడిలా పడి ఉంటాడు- అందుకే ఆయనను దామోదరుడు అంటారు.  దామ- ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.

అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర  ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం.  ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కోలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు "దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది. "నాం తూమలర్ తూవి త్తొళుదు"పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం. "పోయ పిళైయుం " మనం గతంలోచేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం " మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు.  ఈపాటలో ఆండాళ్  మాయానై, మన్నువడ మదురై,  దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది. 

ఆగమములు చెప్పినదేమిటి

పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||

ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది.  పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా  పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మత్రం దానికి సమాధానం ఇస్తుంది. "పూర్ణమిదమ్"- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:"- అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. "పూర్ణాత్ పూర్ణముదచ్యతే"- ఆ పూర్ణమే  ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే. సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది.  అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా. "పూర్ణస్య పూర్ణమాదాయ" ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా?  "పూర్ణమేవా వశిష్యతే"- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి. 

ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు.

 

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం  

 

 

 

Sunday, December 17, 2017

04 వ రోజు - భగవంతుని నాలుగో స్థానం - అంతర్యామి

ఆండాళ్ తిరువడిగలే శరణం

 


పాశురము

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు.మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా  వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది.దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.  

ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది, మనల్ని అట్లానే ఆచరించమంది.  అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం, అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి, వివిద పదార్థాలలో  నే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక, మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు. 

సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు,  లోకంలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే- అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు:  అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా "ఏకైక లభాయ:" కాని  "సర్వ లాభాయ కేశవ" అంటారు.  ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు. 

అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే, విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో  ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా,ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని  భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు. 

అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. ఆళి మళైక్కణ్ణా! - సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా-పర్జన్యా. ఒన్ఱు నీ కై కరవేల్ - ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు-ఉదారంగా ఇవ్వు, ఆళి ఉళ్ పుక్కు - సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , ముగందు కొడార్ త్తేఱి -  పిల్చుకో, ముందు నీవు తృప్తిగా కడుపు నిమ్పుకోని - చాలా ఎత్తుకు వెల్లాలి. 


ఊళి ముదల్వన్-సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో, ఊరువం పోళ్  మెయ్ కఱుత్తు - అట్లాగే  నీ  ఆకారాన్ని సరిదిద్దుకో, పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్  ఆళిపొల్ మిన్ని -  బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు,  మొదటగా మెరవవలె,తర్వాత ఉరమవలె, తరువాత కురవవలె. 


ఆమెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు - ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా-శంఖం ద్వనిలా  ఉరుమవలె. ఆద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి. తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ - ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి, అందరు సుఖించెందుకు వర్షించు. ఆంగళుం మార్గళి నీరాడ మగిళుంద్ - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం     

 

 

03 వ రోజు - భగవంతుని మూడో స్థానం - విభవం(అవతారములు)


 ఆండాళ్ తిరువడిగలే శరణం   

పాశురము

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


విభవం(అవతారములు)

ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.

 

 

"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది. 


ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు.   పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు.  మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు. 


మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది. 

వ్రత ఫలితములు

ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు.  పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక  యంత్రాలు,వాహనాలు  ఉంటే సుఖమా! లేక  సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే  సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.

మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు.  మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు.  అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది,  ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!. 

ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి. 

"నాంగళ్" ఏం కోరిక లేని  "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది  "చ్చాత్తి నీర్ ఆడినాల్"  వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే. 

"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి  "ఊడు కయల్ ఉగళ"  ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి. "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప"  అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్"   పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.  

 

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం